mt_logo

అమ్మ, అమ్మాయి, ఒక ఆంధ్రాబాబు…

By: సీహెచ్. శ్రీనివాస్

‘మమ్మల్ని నమ్ముడి… మీరు రక్షింపబడతారు’ – ఓ మాత దైవవాక్యం.
‘నేను పాదం మోపిన ఈగడ్డ సాక్షిగా మా అన్న మీ ఇంట ఆనందం నింపుతాడు’ – ఒక అమ్మాయి ‘పాద’యాత్ర హామీ.
‘నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు’ – మరో బాబు ‘సీటు’యాత్ర మాట.

‘మీరు తెలంగాణకు అనుకూలంగా లేఖలిచ్చి అడుగుపెట్టండి’   -మనోళ్ల అల్టిమేటమ్.

****

ఎందుకు??

అసలు వీళ్లు మనకు అవసరమా? వీళ్లెందుకు తమ పుణ్యపాదం మన గడ్డపై మోపాలి? వీళ్లెందుకు తెలంగాణపై తమ అభిప్రాయం చెప్పాలి? అసలు వీళ్లెందుకు లేఖలివ్వాలి?

తొమ్మిదేళ్లు ఆయన, ఇంకో ఆరేళ్లు వీళ్ల నాయన తెలంగాణకు చేసిన ‘సేవలు’, జరిగిన చావులు చాలవా?

కళ్లనిండా కంప్యూటర్లే నింపుకున్నవాడికి కడుపు ఎండినవాడు ఎలా కనబడ్తాడు? మా హయాంలోనే తెలంగాణ అభివృద్ధి అంటున్నవాడికి అది ఎక్కడ కనబడింది? రైతు ఆత్మహత్యల్లోనా, చేనేత కార్మికుల ఉరితాళ్లలోనా? పదహారేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా తానే దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో నేటికీ తగ్గని కూలీల వలసల్లోనా? తెలంగాణకు ఒక్క చుక్క నీటికోసం ఏనాడు చిన్న ప్రయత్నం కూడా చేసిన పాపానపోని బాబు, ఇప్పుడు వస్తున్నా-మీకోసం అంటూ ఒక థర్డ్‌రేటెడ్ తెలుగు సినిమాలో పొలిటికల్ కమెడియన్‌లా పొద్దంతా చాయ్ చేస్తూ, కల్లు పోస్తూ, సైకిల్‌కు గాలికొడ్తూ, చిన్న పిల్లల ముడ్లు కడుగుతూ వేస్తున్న చిత్రవిచిత్ర పాత్రలు, పొద్దుగుంకంగనే బస్సులో దూరి మీటింగులు, వీడియో కాన్ఫన్సులతో హైదరాబాద్‌లో ఉన్న చిలుకులకు ఎలా పలకాలో ట్రెయినింగ్ ఇస్తూ, చేస్తున్న యాత్ర ఒక అసమర్థుని నిర్జీవయాత్రలా సాగుతోంది.

ఒక్కసారి తాను చేస్తున్న యాత్రాప్రసంగాల విడియోలు చూసుకుంటే తనకే అర్థమౌతుంది అవి ఎంత నిర్హేతుకంగా, సందర్భరహితంగా ఉంటున్నాయో. పాపం ఆ ‘సినిమా’ ఫోటోలు వేయడానికి ఓ పసుపు పత్రిక ‘ఏనాడూ’ వెనుకంజ వేయలేదు. ఆ ఫ్లాప్ షోను సూపర్‌హిట్టనీ, తెలంగాణ ఎట్లా వస్తదని చిలుక ‘పలుకు’లు ఒలికిస్తుంటాడు మరో పత్రికాధిపతి. తమ తప్పుడు రాతలతో, వంకర గీతలతో ఈ బాబును మరో వినోబాభావేను చేయడానికి పడరాని కష్టాలు పడుతుంటారు. ఆయన సీటెక్కడానికి వీరు తమ భుజాలను దన్నుగా నిలుపుతారు.

కేసీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదనే ఈ బాబు 2009 డిసెంబర్ 9న ఎంతో బాధపడివుంటాడు. బహుశా ఇతర సీమాంధ్ర నాయకులతో తిట్లు కూడా తినివుంటాడు. పర్యవసానమే ట్రస్ట్ భవన్ స్టేజీపై భారీ డ్రామా. కేంద్ర మంత్రిపదవినే తృణప్రాయంగా తీసేసిన వ్యక్తిత్వానికి ఇతనా ఏలిక? అకుంఠిత దీక్షతో పదకొండేళ్లపాటు తెలంగాణ ఉద్యమాన్ని విశ్వవాప్తం చేసిన శక్తిత్వానికి ఈయనా పోలిక? పార్లమెంటులో రాజీనామా చేసి వస్తుంటే, కన్నీళ్లతో కరచాలనం చేసిన ఇతర పార్టీల నేతలకు తెలుసు ఆ వ్యక్తిత్వం గొప్పేమిటో, ఆ త్యాగం విలువేమిటో.

విశ్వసనీయత అని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న బాబు ఆ పదానికి ఉన్న గౌరవాన్ని కూడా మంటలోగలిపాడు. బిడ్డనిచ్చి, గుడ్డనిచ్చి, కూడునిచ్చి, నీడనిచ్చిన మామకు తెలుసు ఆయన విశ్వసనీయత ఏపాటిదో. కేసీఆర్‌ది అతితెలివి అని మాట్లాడే బాబుగారికి ఇన్నేళ్లలో ఏం జరిగిందో అసలేం కనబడలేదు. అవును మరి..! హైటెక్ సిటీ ధగధగల మధ్య బలిదానాల చితిమంటల భగభగలు ఎలా కనబడతాయి? కాంగ్రెస్‌లో అంజయ్య వద్ద మంత్రిగా పనిచేస్తూ, అతి తెలివితోనే మామను సవాల్ చేశాడు. మామపైనే పోటీచేస్తానని బీరాలు పలికి అనామకుల చేతిలో ఓడిపోయినప్పుడు ఈ అతితెలివే ఆయన కాళ్లు పట్టుకుని పార్టీలో చేరేలా చేసింది. ఈ అతితెలివే పార్టీని గుప్పెట్లోకి తీసుకుందీ, పెద్దాయనకు వెన్నుపోటు పొడిచిందీ, చివరకు గుండెపగిలేలా చేసింది.

ఆయన అనుకూలం మనకొద్దు. ఆయన లేఖలూ మనకొద్దు. ఆయన పెట్టడమూ మనం అడుక్కోవడమూ వద్దు. అసలు ఈ తెలంగాణ మట్టిపై ఆయన నీడ కూడా వద్దేవద్దు. ఇప్పుడూ..ఎప్పుడూ…

ఇంకో పక్క ఓ చిలుకపలుకుల అమ్మాయి, తన ‘పాద’యాత్రతో తెలంగాణను “పావనం” చేస్తూ వస్తోంది. వాళ్ల నాయన ఏ పనైనా ఇక్కన్నుంచే మొదలుపెడతాడట. నిజమే.. భూ‘దానాలు’, ధనయజ్ఞాలు ఇక్కడ మొదలయ్యాయి. పోతిరెడ్డిపాడు నీళ్లు అక్కడ పొర్లాయి. బీబీనగర్ నిమ్స్ నిధులు లేక బిక్కుబిక్కుమంటుంటే, కడప రిమ్స్ ధనరాశులతో ధగధగలాడుతుంది.

యోగివేమన యూనివర్సిటీ 100కోట్లతో కళకళలాడుతుంటే, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలు పైసల్లేక కటకటలాడుతుంటాయి.హంద్రీ-నీవాలో నీళ్లు గలగలాపారుతుంటే, కల్వకుర్తి, నెట్టెంపాడుల్లో కాల్వలు నెర్రెలు బారుతుంటాయి. పదివేల రైతు ఆత్మహత్యలు, వందలాది చేనేత కార్మికుల అప్పుల హత్యలు…ఇవీ వాళ్ల నాయన పెట్టిన ప్రసాదాలు. వీళ్లు చెబుతున్న అభివృద్ధి ఫలాలు. ఆమె అన్న తెలంగాణ గుండెగుండెలో ఆనందం నింపుతాడట. సమైక్యవాద ప్లకార్డుతో తెలంగాణ గుండెలో గునపం గుచ్చిన విషయం గుర్తుకురాలేదేమో. ముఖ్యమంత్రై మన కష్టాలు తీరుస్తాడట. పరకాల పరాభవం..పాపం పనిగట్టుకుని జ్ఞాపకం చేయాలేమో. కుక్కమూతి పిందెలతో వరంగల్‌లో తైతక్కలాడిస్తుంటారు. మానుకోటలో చేయించిన డ్యాన్సులు యాదికి లేవేమో?

చంచల్‌గూడ నుంచి నల్లగొండ భూముల్లో కొన్ని ‘బిటి’ విత్తనాలు చల్లబడ్డాయి. అవి ఇప్పుడే మొలకెత్తుతున్నాయి. దిగంతాలనుండి వచ్చిన ‘ఆత్మ’భోధతో ఇన్నేళ్ల తర్వాత కళ్లు తెరుచుకున్నాయి. ఎదిరించిన కలాలను బెదిరిస్తున్నాయి. ఆ కలుపుమొక్కలు పెరిగి విషవృక్షాలుగా మారకముందే వాటిని ఏరిపారేయాలి. తెలంగాణ గట్టుమీద కాల్చిపారేయాలి.మన పంట మన ఇంటే దోచి, కడప కడుపులు నింపి, ఆ పందికొక్కులు ఆఖర్న విసిరే ఆరు మెతుకులకు ఆశపడే ఈ పరాన్నభుక్కులను తెలంగాణ సమాజం నుండి వెలివేయాలి. దారితప్పుతున్న వాళ్లను నిలేయాలి. పాదయాత్రల పేరిట జరుగుతున్న ముప్పేట దాడిని ధైర్యంగా ఎదుర్కొని, ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాలి.

విశ్వాసఘాతుకానికి, నయవంచనకు పెట్టనికోటలు ఈ పార్టీలు. కాలకూటాన్ని, కార్చిచ్చును ఒకేసారి విరజిమ్మగల రాహుకేతువులు అధినేతలు.

‘తెలంగాణ అని ఉచ్చరించడానికి వీల్లేదు. వెనుకబడిన ప్రాంతంగా మాత్రమే పలకండి’ అన్నవాడు ఒకడు, ‘రాజేంద్రా..ఏదీ నీ తెలంగాణ..ఎక్కడ నీ తల’ అని వికటాట్టహాసం చేసినవాడు మరొకడు. చచ్చిపోయినంత మాత్రాన బతికిపోరు. చేసిన తప్పులు మాసిపోవు. రేగిన గాయాలు మానిపోవు. తొమ్మిదివందల మంది తల్లుల ఉసురు తగలకపోదు.

వీళ్లు, వీళ్ళ వారసులు తెలంగాణకు అనుకూలమని ఎందుకు చెప్పాలి? ఉత్తరాలు రాయండని వీళ్లను ఎందుకు దేబిరించాలి? లేఖలిస్తే వీళ్లు నష్టపోయేది రెండు కాగితాలు, నాలుగు సిరా చుక్కలు.. మనం నష్టపోయేది నిండు జీవితాలు, కన్నీటి సంద్రాలు.

అమ్మలూ.. అమ్మాయిలూ.. బాబులూ.. ఎందుకు చేస్తున్నారీ యాత్రలు? ఎన్ని వీసాలు తీసుకున్నారు? మీరు చేసిన పాపాలు శాపాలుగా మారకముందే, మా తల్లుల కన్నీటి చుక్కలు బ్రహ్మస్త్రాలుగా వేటాడక ముందే ఈ గడ్డను ఒదిలేయండి. మేం జరుపుతున్నది కచ్చితంగా మరో స్వాతంత్య్ర పోరాటమే. ఇక్కడ మీకు రెండే ఆప్షన్లు. ఒకటి ‘క్విట్ తెలంగాణ’. రెండోది కూడా ‘క్విట్ తెలంగాణ’. మళ్లీ ఇటువేపు చూడాలనుకున్నప్పుడల్లా గుర్తుకు తెచ్చుకోండి – నిన్నటి పట్టాల మధ్య నుండి మిమ్మల్నే చూస్తున్న నిప్పురాళ్లను.

శ్రీకాంతాచారి, యాదయ్య… తారలు రాలిపడ్తున్నాయి. పడి కూడా వెలుగుతున్నాయి. వెలుగుతూ దారి చూపుతున్నాయి. ఆ దారి చివరన తెలంగాణ. నడవడమే మన పని. అడ్డొచ్చిన ముళ్లను తొలగిస్తూ… గమ్యానికి మరింత చేరువవుతూ…


[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *