mt_logo

తెలంగాణ సర్కారుకే ఇది సాధ్యం!!..

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి అద్భుతమైన వరమని, ఇదొక అద్భుతమైన నిర్మాణమని 15వ ఆర్ధికసంఘం సభ్యులు ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్ధికసంఘం సభ్యులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తిచేయడం కార్యదీక్షకు నిదర్శనమని, మిషన్ భగీరథ పథకం కూడా ఒక అద్భుతమని, ఇది తెలంగాణ సర్కారుకే సాధ్యమైందని వారు అభినందించారు.

పర్యటనలో భాగంగా సభ్యులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ ను సందర్శించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం వద్ద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీ పనులను పరిశీలించారు. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును సందర్శించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద ఉన్న హెలిపాడ్ కు చేరుకున్న వారికి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు స్వాగతం పలికి ప్రాజెక్టు వివరాలను ఫోటో ఎగ్జిబిషన్, ప్రాజెక్టు మ్యాప్ ద్వారా వివరించారు.

కేవలం రెండున్నర సంవత్సరాల కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేయగలిగామని, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకు ఆర్ధికసంఘం తోడ్పాటును అందించాలని సీఎస్ ఎస్కే జోషి ఈ సందర్భంగా సభ్యులను కోరారు. అనంతరం ఆర్దికసంఘ సభ్యులు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరగడం ఆశ్చర్యంగా ఉందని, తప్పకుండా రాష్ట్రప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందని వారు హామీ ఇచ్చారు. అనంతరం మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులపై కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు శుద్ధిచేసిన తాగునీటిని అందించాలనే మహదాసయంతో రూపొందించిన మిషన్ భగీరథ పథకం అద్భుతమని సభ్యులు ప్రశంసించారు. ఈ పర్యటనలో ఆర్ధికసంఘం సభ్యులు అరవింద్ మెహతా, రవి కోటా, రీటా లహరి, అశోక్ లాహిరి, ఆంటోని సిరియాక్ లతో పాటు తెలంగాణ రాష్ట్ర సీఎస్ ఎస్కే జోషి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఆర్డీవో శ్రీనివాస్ రావు, కార్యనిర్వాహక ఇంజినీర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *