mt_logo

107పై అప్పుడేమన్నారు?

తెలంగాణ రైతుకు కరెంటు తీగ బిగించి ఉసురు తీయాలని ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టే కనిపిస్తున్నది. రుణమాఫీతో సహా ఏ అంశంలోనూ తెలంగాణ ప్రగతి వేగాన్ని అందుకోలేక చతికిలబడ్డ చంద్రబాబు ప్రభుత్వం, విద్యుత్ అంశాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టే యత్నంలో భాగంగా కేంద్రంతో ప్రేమలేఖల రాయబారం కూడా కొనసాగిస్తున్నది. తెలంగాణ విద్యుత్‌కు ఇపుడు కీలక వనరుగా ఉన్న శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి మీద గగ్గోలు పెడుతున్నారు. నీటి మట్టాల మీద హరికథలు చెబుతున్నారు.

-నాడు వద్దు.. నేడు ముద్దా!
-పెన్నా బేసిన్ కోసం కృష్ణా బేసిన్ బలిపెట్టిన జీవో
-కడప సీఎంగా వ్యవహరిస్తున్నారని నాడు టీడీపీ ఆగ్రహం
-శ్రీశైలంపై సీమకు లేని హక్కులు కల్పించిన వైఎస్
-పచ్చపార్టీ డబుల్ గేమ్
-రెండు కండ్ల బాబు.. రెండు నాల్కల వాదన
-107 జీవోపై నాడు ఉద్యమం జరిపిన టీడీపీ
-డెల్టా ఎడారిగా మారుతుందని గగ్గోలు
-జీవోకు వ్యతిరేకంగా దృశ్యరూపకం ద్వారా ప్రచారం
-కోస్తా గొంతు కోస్తున్నారన్న దేవినేని
-ఇవాళ మాట మార్చి వగలమారి కన్నీళ్లు
-శ్రీశైలం విద్యుత్తు కోసమే..
-పునాదిరాయి వేసిననాడే చెప్పిన నెహ్రూ

సీమాంధ్ర టీడీపీ మంత్రులు రంగంలోకి దిగి రంకెలు వేస్తున్నారు. సీమకు, ఆంధ్రకు తాగునీటి కష్టాలు వస్తాయని దొంగేడుపులు అందుకున్నారు. వాస్తవానికి పెన్నా బేసిన్‌లో ఉన్న సీమకు ఈ నీటిమీద హక్కే లేదు. అయినా పదేపదే 107 జీవోను ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ ఈ జీవో విడుదలైన రోజున ఇదే పార్టీ ..ఇదే నాయకులు & ఈ పార్టీ అధినేత ఏమన్నారు? ఏం చేశారు?

గుట్టుచప్పుడు కాకుండా జీవో..: శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టాల నిర్వహణ కోసం 2004 సెప్టెంబర్ 28న ఆనాటి వైఎస్ ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా 107 జీవో విడుదల చేసింది. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో 69కు మార్పు చేర్పులు చేసి ప్రాజెక్టు కనీస నీటిమట్టాన్ని 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచారు. ప్రాజెక్టులో ఎప్పుడూ ఈ నీటిమట్టం కొనసాగించాలన్నది దాని సారాంశం. వాస్తవానికి కడప, నెల్లూరు జిల్లాలు పెన్నా బేసిన్‌లో ఉన్నాయి.

కృష్ణ నీటిని వాడకూడదు. అయినా అధికారం చేతిలో ఉందని వైఎస్ సర్కారు పోతిరెడ్డిపాడు చేపట్టి నదిని ఆ దిశగా ఈ జీవోను అడ్డుపెట్టుకుని మళ్లించింది. కృష్ణ నీటిని రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా మళ్లించాలంటే భారీగా నీరు నిల్వ ఉండడం అవసరం. దీని ఫలితంగా దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీరు విడుదల కావాలంటే ప్రాజెక్టులోసదరు నీటిమట్టం వరకూ నీరు రావాలి. కర్మకాలి ఆ స్థాయికి నీరు రాకపోతే సాగర్‌కు నీరు ఉండదు.

ఈ జీవోకు ముందు తూతూ మంత్రంగా వైఎస్ ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. బీజేపీ నోరు మెదపకుండా ఉండిపోగా టీఆర్‌ఎస్, టీడీపీ నాయకులు వ్యతిరేకించారు. మొత్తానికి ఏకాభిప్రాయం రాలేదు. అయినా సర్కారు జీవో విడుదల చేసింది. భగ్గుమన్న టీడీపీ…: వైఎస్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో మీద ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గగ్గోలు పెట్టింది. దాని ఆస్థాన మీడియా మిన్ను మన్ను ఏకం చేసింది.

అయిపోయింది. ఇక డెల్టాకు నీరు రావడం కల్ల. మొత్తం నీరంతా సీమకు మళ్లించే కుట్రే ఇది అంటూ భారీగా ప్రచారాలు చేశాయి. ఆ రోజు నందిగామ ఎమ్మెల్యేగా ఉన్న నేటి ఏపీ భారీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ జీవో మీద కురుక్షేత్రాన్ని తలపించే యుద్ధం చేశారు. ఆనాడు జిల్లా పరిషత్ సమావేశంలో రచ్చరచ్చ చేశారు. తక్షణం జీవో రద్దు చేయాలంటూ రోజంతా కార్యకలాపాలు స్తంభింపచేశారు. రైతులు తిరగబడాలని పిలుపు ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేవలం కడప జిల్లాకే సీఎంగా వ్యవహరిస్తున్నారన్నారు. కృష్ణా డెల్టాకన్నా సీమకు ముందు నీరు విడుదల చేసే సంప్రదాయం తీసుకువచ్చారని దుయ్యబట్టారు. నీటిమట్టం పెంపువల్ల డెల్టా ఎడారిగా మారిపోతుందని గగ్గోలు పెట్టారు. పోతిరెడ్డిపాడునుంచి 25 టీఎంసీల నీళ్లు పట్టుకుపోతున్నారన్నారు. తక్షణమే 107 జీవో రద్దు చేయకపోతే ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు.

ఆనాడు మాజీమంత్రిగా ఉన్న కోడెల శివప్రసాదరావు ఈ జీవోను నమ్మకద్రోహమని అభివర్ణించారు. అంతకుముందు జరిగిన అఖిలపక్షంలో తాను ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పుకున్నారు. 40 సంవత్సరాలు సాగర్ ఆయకట్టు, 150 సంవత్సరాల డెల్టా ఆయకట్టును ఏం చేస్తారో చెప్పాలని నిలదీశానన్నారు. సీమకు నీరు కేవలం సహాయం మాత్రమేనని, వైఎస్ హక్కుగా మారుస్తున్నారని దుయ్యబట్టారు.

మేలు చేయాల్సిన రాజే…టీడీపీ దృశ్యరూపకం: ఇవాళ జీవో 107ను శిలాశాసనంగా చెబుతున్న టీడీపీ ఆ రోజు ఇదే జీవో రద్దు చేయాలంటూ దృశ్యరూపక మాధ్యమం ద్వారా ప్రచారం జరిపింది. రాష్ట్రానికి మేలు చేయాల్సిన రాజే తన ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తే ప్రజలు గోడు పట్టించుకునేదెవరు? ఎగువన ఉన్న కర్ణాటకను తప్పుపడుతూ మనం చేస్తున్నదేమిటి? … అంటూ సీడీలు వీడియోలు పెట్టి మరీ ప్రచారం చేసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ ధర్నాలు చేస్తే చంద్రబాబు వైఎస్ మోసం మీద మహా ఉపన్యాసం చేశారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామన్నారు. పార్టీ శ్రేణులు గల్లీలనుంచి అసెంబ్లీ దాకా ప్రచారాన్ని హోరెత్తించారు.

2012లో కూడా..: ఈ జీవో మీద వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే కాదు…2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో సైతం టీడీపీ భారీ ఆందోళనలు జరిపింది. సాగర్ ఆయకట్టుకు నీటి విడుదలకు నీటిమట్టాల సమస్య వచ్చినపుడు ప్రకాశం బ్యారేజీ మీద జరిపిన ఆనాటి ధర్నాలో పాల్గొన్న ధూళిపాళ్ల నరేంద్ర జీవో 107ను తీవ్రంగా దుయ్యబట్టారు. వైఎస్ తెచ్చిన జీవో కారణంగా డెల్టా ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కోడెల మాట్లాడుతూ ఆ జీవో కొనసాగితే రాష్ట్రంలో ఆహార కొరత ఏర్పడుతుందన్నారు.

అవసరమైతే తగ్గించే అవకాశం ఉందన్న పొన్నాల..
అఖిల పక్ష నిర్ణయం మేరకు జీవో ఇచ్చామని ఆనాటి నీటిపారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. అవసరమైతే అంతకన్నా తక్కువ స్థాయిదాకా నీరు వాడుకునే వెసులుబాటు ఈ జీవోలో ఉందన్నారు.

ఇవాళ మాట మార్చి…: ఆనాడు 107 జీవో మీద అంత గగ్గోలు పెట్టిన దేవినేనికి ఆరోజు సీమ తాగునీరు గుర్తుకు రాలేదు. కృష్ణా డెల్టా మాత్రమే గుర్తున్నది. ఆంధ్రా రైతులు మాత్రమే గుర్తున్నారు. కానీ ఇవాళ తాగునీరు గుర్తుకు వస్తున్నది. సాగునీరు గుర్తుకు వస్తున్నది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే సీమాంధ్రలో ప్రజలంతా నీళ్లు దొరకక అల్లాడుతారా అన్నరీతిలో ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచారాన్ని చూసి రాజకీయవర్గాలే విస్తుపోతున్నాయి.

తొలినుంచి ఇంతే..
1963లో శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు చేపట్టినపుడు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. ఆంధ్రప్రదేశ్ ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నదని లోక్‌సభలోనే తీవ్ర అందోళన జరిపింది. తాము తీవ్రంగా నష్టపోతామని నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కన్నంవార్ ఢిల్లీకి ప్రతినిధి బృందంతో కలిసి వెళ్లి మరీ విజ్ఞాపనలు చేశారు. అయితే ఆనాడు కేంద్ర నీటివనరులు, విద్యుత్ శాఖ సీమాంధ్రకు చెందిన కేఎల్‌రావు పక్క రాష్ట్రాల అభ్యంతరాలు పక్కనపెట్టి అనుమతులు ఇప్పించారు.

తాము ఈ ప్రాజెక్టును కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే వాడుతున్నామని చెప్పారు. జూలై 24న ప్రాజెక్టుకు పునాదిరాయి వేసిన సందర్భంగా జరిగిన సభలో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో ఇదే మాట చెప్పించారు. ఎట్టి పరిస్థితిలోనూ సాగునీటికి వాడేది లేదన్నారు. ఆ తర్వాత నెహ్రూ ఇచ్చిన హామీనే తుంగలో తొక్కి సాగునీటికి వాడడం ప్రారంభించారు. రానురాను విద్యుత్ ఉత్పత్తి కన్నా సాగునీటి వాడకమే పెంచేశారు. 1996 నాటికి ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు రుణం కోసం జీవో 69 ఇచ్చారు. తర్వాత వైఎస్ సీమ ప్రాజెక్టులకు నీరు మళ్లించేందుకు జీవో 107 విడుదల చేశారు. సీమాంధ్ర పాలన యావత్తూ ఇలాగే సాగింది.

ఆంధ్రాముఖ్యమంత్రి ఉంటే ఒక జీవో.. సీమ ముఖ్యమంత్రి ఉంటే ఇంకో జీవో.. ఎప్పటికప్పుడు సీమాంధ్రుల అవసరాలకోసం అన్ని నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చేశారు. సీమకు నీళ్లు కావాల్సివస్తే ఆగమేఘాల మీద జీవోలు పుట్టుకు వచ్చాయి. కోస్తాకు అవసరమైతే దానికి సవరణలు పుట్టుకువచ్చాయి. ఎటొచ్చీ తెలంగాణకే ఏ జీవోలు రాలేదు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *